ప్రభాస్ పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్

కంగనా రనౌత్ హీరోల గురించి పాజిటివ్ గా మాట్లాడటం అరుదే. హృతిక్ రోషన్ లాంటి పెద్ద స్టార్ నే ఉతికి ఆరేసిన హీరోయిన్ ఆమె. సినీ పరిశ్రమలో పురుషాధిక్యత గురించి కూడా తరచుగా కామెంట్లు చేస్తూ ఉంటుందామె. అలాంటి హీరోయిన్ మన ప్రభాస్ ను ఓ రేంజిలో పొగిడేయడం విశేషం. ప్రభాస్ తో కలిసి కంగనా తెలుగులో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి కంగనా చిన్న స్థాయి కథానాయిక. కానీ గత దశాబ్ద కాలంలో ఆమె రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ మీద పొగడ్తలు గుప్పించిందామె. తనతో కలిసి నటించిన ప్రభాస్ ఇప్పుడున్న స్థాయికి తనకు గర్వంగా ఉందని కంగనా చెప్పింది.

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి ‘ఏక్ నిరంజన్’లో నటించానని.. అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ కాదని.. కానీ ఇప్పుడు ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించాడని.. అతడి ఎదుగుదల చూస్తే తనకు గర్వంగా ఉందని కంగనా చెప్పింది. ‘ఏక్ నిరంజన్’ చిత్రీకరణ సమయంలో ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లమని.. ఒకరినొకరు టీజ్ చేసుకునేవాళ్లమని చెప్పింది. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అని.. అతడితో మళ్లీ సినిమా చేయాలనిపిస్తోందని.. అందుకోసం వెయిట్ చేస్తున్నానని అంది. ఇక టాలీవుడ్లో కలిసి నటించాలనుకునే మరో హీరో ఎవరని అడిగితే.. మహేష్ బాబు పేరు చెప్పింది కంగనా. ఇక తన కొత్త సినిమా ‘మణికర్ణిక’ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఉన్న నెగెటివిటీ అంతా.. ట్రైలర్ చూశాక పక్కకు వెళ్లిపోయిందని కంగనా చెప్పింది. ‘యన్.టి.ఆర్’ సినిమా కోసమే క్రిష్ ఈ చిత్రం నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు తప్పితే.. తామేమీ అతడిని తప్పించలేదని కంగనా మరోసారి నొక్కి వక్కాణించింది.

Share this article: